102 Year Old Woman Postal Ballot : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఓ 102 ఏళ్ల వృద్ధురాలు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఇంటి నుంచే గురువారం.. బుధియారి కౌడన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆమెతోపాటు మరో 57 మంది పోస్టల్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేశారు.
కాంకేర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 306 మంది 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులు.. ఉన్నట్లు పోలింగ్ అధికారి శిఖర్ సోనీ తెలిపారు. కంకేర్ అసెంబ్లీలో 80 ఏళ్ల పైబడిన వారు 53 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 22 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. అంతగఢ్ అసెంబ్లీలో 80 ఏళ్ల పైబడిన వారు 31 మంది.. ఐదుగురు దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. భానుప్రతాప్‌పుర్‌లో 80 ఏళ్ల పైబడిన వారు 169 మంది ఉండగా.. 26 మంది దివ్యాంగులు ఉన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 58 ఓట్లు పోలయ్యాయి.
అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు..
ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడం వల్ల అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుంచే ఓటేస్తున్నారు. అందుకోసం పలు విధివిధానాలను అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా వృద్ధులు, వికలాంగులు ఈ విషయాన్ని వారి ప్రాంతంలోని బూత్ లెవల్ ఆఫీసర్‌కు తెలియజేయాలి.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వారిని ముందుగా బూత్‌స్థాయి అధికారులు గుర్తించి వారి ఇంటికి వెళ్లి ఫాం 12డీని అందజేస్తారు. అధికారులు అందజేసిన ఫాం 12డీని ఓటర్లు పూరించి తిరిగి బీఎల్‌వోలకు అందజేస్తారు. ఈ దరఖాస్తులను బీఎల్‌వోలు ఆర్‌వోలకు అందజేస్తారు. దరఖాస్తుల ఆధారంగా వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారు. అయితే ఇందులో ఎవరైనా పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటు వేస్తానని చెబితే వారికి 12డీ దరఖాస్తులు ఇవ్వరు. వారు నేరుగా పోలింగ్‌కేంద్రానికి వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లోనూ దివ్యాంగులకు ర్యాంపులు, వయోవృద్ధులకు చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంటాయి.