1008 Kms Marathon To Ayodhya :రన్నింగ్ చేస్తూ అయోధ్యకు చేరుకుని శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాడు మధ్యప్రదేశ్ ఇందౌర్కు చెందిన కార్తీక్ జోషి. ఇందౌర్ నుంచి మొత్తం 14 రోజుల పాటు 1008 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. జనవరి 22న అయోధ్యలో జరిగే రామయ్య ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు ఈనెల 5న తన పరుగు యాత్రను ప్రారంభించనున్నాడు కార్తీక్.
"ఒక్కోసారి ఒకటి లేదా రెండు రోజుల లాంగ్ రన్లకు వెళ్తాను. అప్పుడు నేను శారీరకంగా అలసిపోతాను. అయితే ఆధ్యాత్మికతకు తోడు ఆత్మస్థైర్యం తోడైతే ఎన్ని వేల కిలోమీటర్లనైనా సులువుగా పూర్తి చేయగలం. నేను రన్నింగ్ చేసేటప్పుడు నా బలం రాముడు, బజరంగ్బలి మాత్రమే. చాలా ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యలో కొలువుదీరబోతున్నాడు. అందుకే రన్ చేస్తూ అయోధ్యకు వెళ్తున్నా. "
- కార్తీక్ జోషి, మారథాన్ రన్నర్
తన ప్రయత్నం దేశ యువతలో ఆధ్యాత్మికతపై గౌరవం పెంచడమే కాకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా చేస్తుందని నమ్ముతున్నాడు కార్తీక్ జోషి. 'ప్రస్తుతం తరానికి ఆధ్యాత్మికతకు అనుసంధానం చేయాలనుకుంటున్నా. చిన్న చిన్న విషయాలకే చాలామంది డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. ఎంత పెద్ద సమస్యనైనా మన ఆధ్యాత్మికత సులువుగా పరిష్కరించగలదు.' అని మారథాన్ రన్నర్ కార్తీక్ జోషి తెలిపారు.