1000 Trains Ayodhya :వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు 1000కి పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందుతున్నట్లు రైల్వే శాఖ వర్గాలు ప్రకటించాయి.
ఆలయం ఓపెనింగ్‌కు ఇంకా కొద్దిరోజులే సమయం మిగిలి ఉండటం వల్ల దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సింహభాగం పనులు పూర్తవ్వగా మిగిలిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ డిసెంబర్ చివరికల్లా అవి కూడా పూర్తవుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ భక్తులకూ శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొనే రైల్వే శాఖ వెయ్యికి పైగా రైళ్లను నడిపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
'రద్దీ పెరిగితే రైళ్లూ పెంచుతాం'
ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి వంద రోజుల వరకు ఈ రైళ్లు తిరిగే అవకాశం ఉంది. కాగా, వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్‌ను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ 100 రోజుల్లో దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, నాగ్‌పుర్, లఖ్‌నవూ, జమ్మూ సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల నుంచి ఈ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. డిమాండ్ ఆధారంగా ఈ రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్ చేసి ఛార్టెర్డ్ సర్వీసులు కూడా అందించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.