చెత్తకుప్పలో నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాల ఓ ఎలుక సాయంతో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని దిండోశీ ప్రాంతంలో జరిగింది. చివరకు బంగారు ఆభరణాలను యజమానులకు అప్పగించారు. ఇంతకీ ఆ చెత్తకుప్పలోకి బంగారు ఆభరణాలు ఎలా వెళ్లాయి?
ఏం జరిగిందంటే?:దిండోశీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరే కాలనీకి చెందిన సుందరి అనే మహిళ.. తన కుమార్తె వివాహం కోసం రుణం తీసుకునేందుకు 100 గ్రాముల బంగారు ఆభరణాలతో బ్యాంకుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యాచకురాలు, ఆమె కుమారుడు కనిపించారు. ఓ కవర్లో ఉన్న వడాపావ్‌ను ఆ బాలుడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు సుందరి. తీరా బ్యాంకుకు వెళ్లి చూసుకోగా.. వడాపావ్ ఇచ్చిన బ్యాగ్‌లోనే బంగారం ఉన్నట్లు గుర్తించారు. హుటాహుటిన ఆ యాచకురాలు కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. కానీ, వారు అక్కడ లేకపోవటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న దిండోశీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ సూరజ్ రౌత్ తనిఖీలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ యచకురాలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆమెను పట్టుకుని విచారించగా.. వడాపావ్ ఎండిపోయిందనుకుని సుందరి ఇచ్చిన కవర్‌ను చెత్తకుప్పలో పడెసినట్లు తెలిపింది. అయితే.. చెత్తకుప్పలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బంగారం ఉన్న బ్యాగ్ కనిపించలేదు.