దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ ఘటన మరవకముందే రాజస్థాన్‌లో జైపుర్‌లో అలాంటి ఘోరం జరిగింది. తాను చేస్తున్న కొన్ని పనులకు మేనత్త అడ్డు వస్తోందన్న కోపంతో ఆమెను సుత్తితో కొట్టి చంపాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని పది ముక్కలుగా నరికి అడివిలో పాతిపెట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ చివరకు దొరికిపోయాడు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జైపుర్.. విద్యానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మృతురాలు సరోజకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరగ్గా.. కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. అయితే సరోజ భర్త 27 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో సరోజ బాగోగులను ఆమె మేనల్లుడు అనూజ్ చూసుకుంటున్నాడు. అనూజ్ ఖర్చులను సరోజ భరించేది.
అయితే డిసెంబర్ 11వ తేదీన అనూజ్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తన మేనత్త కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆవుకు రొట్టెలు పెట్టేందుకు తన అత్త వెళ్లిందని ఆ తర్వాత ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం సరోజ కుమార్తె పూజకు ఈ విషయాన్ని తెలియజేశాడు. పోలీసుల సహాయంతో వెతుకుతున్నట్లు చెప్పాడు. కానీ, అనూజ్ మాటలపై పూజకు అనుమానం వచ్చింది. అనూజ్‌కు చెప్పకుండా డిసెంబరు 13వ తేదీన సరోజ ఇంటికి వెళ్లింది. లోపలికి వెళ్లగా.. అనూజ్ వంటగదిలో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేస్తున్నాడు. వెంటనే పూజ.. అనూజ్‌ను రక్తపు మరకల గురించి నిలదీసింది. దీంతో అనూజ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ విషయాన్ని పూజ.. తమ సోదరీమణులకు తెలియజేసి పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అనూజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన పనులకు అంతరాయం కలిగించడం వల్లే సరోజను సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అనంతరం పది ముక్కలుగా నరికి దిల్లీ శివారు అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు చెప్పాడు. వెంటనే పోలీసులు.. అనూజ్ పాతిపెట్టిన శరీరభాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆరునెలల క్రితం హత్య కేసును ఛేదించిన పోలీసులు..
దిల్లీలో ఆరు నెలల క్రితం ఇద్దరిని హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిహార్‌లోని పూర్ణియాకు చెందిన అన్వరుల్ హక్.. దిల్లీలోని ఖుజురీ ఖాస్ ప్రాంతంలో టైలర్ దుకాణం నడుపుతున్నాడు. జులై 31 తేదీన కొందరు వ్యక్తులు టైలర్ షాప్‌కు వచ్చి అన్వరుల్తో పాటు అతడి బంధువైన మరో యువతిని హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
అన్వరుల్‌ను అతడి సహచరులు అతిన్, అహ్సాన్, షానవాజ్‌లతో కలిసి ఉస్మాన్ హత్య చేసినట్లు తేలింది. వెంటనే అతిన్, అహ్సాన్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు అబూ ఉస్మాన్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నానని ఉస్మాన్ తెలిపాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన బంధువు అన్వరుల్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని.. అందుకే చంపేశానని వెల్లడించాడు.