దేశంలో కులాలవారీగా జనగణన జరిపించాలని బిహార్ అఖిలపక్షం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలో బిహార్‌లోని అఖిలపక్ష నేతలు.. దిల్లీలో మోదీని కలిశారు. కులాలవారీగా జనగణన జరిపి, వెనుకబడిన వర్గాల ప్రజల సమాచారం తెలుసుకుంటే.. వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చని బిహార్ ప్రతినిధి బృందం ముక్తకంఠంతో ప్రధానికి వివరించింది.
కులగణనపై ఇప్పటికే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని.. సమావేశం తర్వాత నితీశ్‌కుమార్ వివరించారు.
"మేం అన్నివర్గాల అభిప్రాయాలను ప్రధానమంత్రికి చెప్పాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, మైనార్టీల తరఫున మా అభిప్రాయాలు చెప్పాం. ఒకసారి కులాలవారీగా జనగణన జరిగితే అన్ని కులాల సమాచారం మన వద్ద ఉంటుంది. ప్రభుత్వాలు వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయా వర్గాల ప్రజల శాతానికి తగ్గట్టుగా వారికి ప్రస్తుతం ప్రయోజనం కలగడం లేదు. వారి సమాచారం తెలుసుకుంటే... వారి అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్ని అంశాల్లో వారిని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. ప్రధానమంత్రి మా వాదనలు పూర్తిగా ఆలకించారు. ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని మేమంతా కోరాం."
-నితీశ్‌కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
కులగణనను ప్రధాని మోదీ వ్యతిరేకించలేదని చెప్పిన నితీశ్‌కుమార్... కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'గొడవలు ఉండవు'
కులాలవారీగా జనగణన చారిత్రకం అవుతుందని బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు ఏ కులానికి చెందినవారో తెలిస్తే రిజర్వేషన్లు కల్పించడం సులభం అవుతుందని చెప్పారు.
"మా ప్రతినిధుల బృందం కేవలం బిహార్‌లో కులాలవారీగా జనగణన కోసం ప్రధానిని కలవలేదు. యావత్ దేశంలో కులాలవారీగా జనగణన జరగాలని కలిశాం. జాతీయ జనగణన వల్ల ఉన్మాదులు పేట్రేగిపోతారని, మతాల వారీగా సమస్యలు వస్తాయి అంటే.. మతాల వారీగా జనగణన కూడా జరగాల్సిన అవసరం లేదు. జనగణన వల్ల మతాల మధ్య గొడవలు జరిగినట్లు ఇప్పటివరకు చూడలేదు. ఇక ఖర్చుల విషయానికి వస్తే.. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల జనగణన జరుగుతున్నప్పుడు మరో కాలమ్ జోడిస్తే సరిపోతుంది. జంతువులు, పర్యావరణం, వృక్షాల గణన కూడా జరుగుతున్నప్పుడు.. మనుషులు ఏ కులానికి చెందినవారు అనే గణన జరిగితే తప్పేంటి.? ప్రజలు ఏ కులానికి చెందినవారో తెలిస్తే రిజర్వేషన్లు కల్పించడం సులభం అవుతుంది. మా వాదనను ప్రధాని సావధానంగా విన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తాం."
-తేజస్వీ యాదవ్, బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత
కేంద్రం గత నెలలో.. పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రమే లెక్కిస్తామని చేసిన ప్రకటన నేపథ్యంలో కుల గణన అంశం బయటకొచ్చింది. బిహార్ వంటి రాష్ట్రాల్లో మండల్ కమిషన్ కాలం నుంచే ఓబీసీలదే రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉండటం వల్ల కులగణన చేపట్టాలని బిహార్ రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్నారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. కానీ కేంద్రం ఇందుకు విముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష బృందంతో ప్రధానిని సోమవారం నితీశ్ కుమార్ కలిశారు.
ఇదీ చూడండి:Caste census: ఏడాది తర్వాతే కులాలవారీ జనగణన!
ఇదీ చూడండి:'రిజర్వేషన్లలో 50శాతం పరిమితిని ఎత్తేయండి'