భారీ వర్షాల కారణంగా జమ్ము కశ్మీర్లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది వరకు ఆచూకీ గల్లంతైంది. కిష్టావర్ జిల్లాలోని హోంజర్ అనే మారుమూల గ్రామంలో ఈ వరదలు సంభవించాయని అధికారులు తెలిపారు. గ్రామంలో సుమారు తొమ్మిది ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఘటనపై సమాచారం తెలియగానే హుటాహుటిన గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
గల్లంతైన వారిని కాపాడేందుకు సైన్యం, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కిష్టావర్ జిల్లా అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్రం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. అన్ని రకాల సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అవసరమైతే వాయుసేన సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్లలో తరలించేందుకు ఎయిర్ఫోర్స్ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు.