Electrocution in West Bengal : వినోదం కోసం వ్యాన్‌లో ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్.. 10 మంది ప్రాణాలు బలిగొంది. బంగాల్లోని కూచ్ బెహార్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. కరెంట్ షాక్‌తో గాయపడిన మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘోరం.. కరెంట్ షాక్‌తో 10 మంది మృతి.. వ్యాన్‌లోని డీజే సిస్టమ్ వల్లే! - విద్యుత్ షాక్‌తో 1ం మంది మృతి
Electrocution in West Bengal : కరెంట్ షాక్ తగిలి వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్ కూచ్ బెహార్లో జరిగింది. వ్యాన్ వెనుక భాగంలో ఉన్న డీజే సిస్టమ్ జనరేటర్ వైరింగ్‌లో సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమని తెలిసింది.
సీతల్‌కుచి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 27 మంది వ్యాన్‌లో ఆదివారం జల్పేశ్కు వెళ్తున్నారు. ఆదివారం రాత్రి 12 గంటలు దాటాక ఒక్కసారిగా వాహనం అంతటా విద్యుత్ సరఫరా జరిగింది. ఏమైందో తెలిసేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
"వాహనం వెనుక భాగంలో ఉన్న డీజే సిస్టమ్ జనరేటర్ వైరింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. వ్యాన్‌ను సీజ్ చేశాం. కానీ డ్రైవర్ పరారయ్యాడు." అని చెప్పారు మాతాభంగా ఏఎస్పీ అమిత్ వర్మ.