మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (anil deshmukh news) గురించి సంచలన విషయాలు వెల్లడించారు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే. అనిల్ దేశ్‌ముఖ్, రవాణా శాఖ మంత్రి అనిల్ పరాబ్.. 10 మంది పోలీస్ అధికారుల దగ్గర నుంచి రూ.40 కోట్ల లంచం తీసుకున్నారని తెలిపారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో వాజే (sachin vaze latest news) ఈమేరకు పేర్కొన్నారు.
"2020 జులైలో పరమ్ వీర్ సింగ్ 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై దేశ్‌ముఖ్, పరాబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్స్‌ను రద్దు చేసేందుకు సంబంధిత అధికారుల నుంచి రూ.40 కోట్లు వసూలు చేశారని తెలిసింది. ఇద్దరికీ చెరో రూ. 20 కోట్లను అధికారులు సమర్పించుకున్నారు."
-సచిన్ వాజే, మాజీ పోలీస్ అధికారి
'బార్ల నుంచి డబ్బు తెమ్మనేవారు'
బార్లు, రెస్టారెంట్ల నుంచి దేశ్‌ముఖ్ తనను డబ్బు వసూలు చేయమనేవారని ఆరోపించారు వాజే. హై ప్రొఫైల్ కేసుల దర్యాప్తులో కూడా సూచనలు చేస్తూ ఉండేవారని పేర్కొన్నారు. గతేడాది అక్టోబరులో దేశ్‌ముఖ్.. 1,750 బార్లు, రెస్టారెంట్ల జాబితా ఇచ్చారని తెలిపారు. ఆ జాబితాలోని ప్రతి బార్, రెస్టారెంట్ నుంచి రూ.3 లక్షలు వసూలు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
అనిల్ దేశ్‌ముఖ్ మాజీ కార్యదర్శి సంజీవ్ పలాండే, సహాయకుడు కుందన్ శిందేపై ధాఖలైన ఛార్జ్‌షీట్‌లో భాగంగా ఈడీ సచిన్ వాజే వాంగ్మూలాన్ని నమోదు చేసింది.