రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పోలీసులు.. ఓ ప్రైవేటు బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వెండిని అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్లు సమాచారం.
బస్సు సీటు కింద 100 కిలోల వెండి.. నడుము బెల్ట్‌లో 16 కేజీల బంగారం - 100 కిలోల వెండి
రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సుపై అనుమనం వచ్చి.. రాజస్థాన్ చెక్‌పోస్ట్ అధికారులు సోదాలు జరపగా.. ఓ సీటు కింద భారీగా వెండి పట్టుబడింది. దాని విలువ దాదాపు రూ.86 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రూ.8.40 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం..
జిల్లాలోని అబురోడ్ పోలీసులు.. మావల్ చెక్‌పోస్ట్ వద్ద రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సాధారణ చెకింగ్‌లో భాగంగా.. ఓ ప్రైవేట్ బస్సును పోలీసులు ఆపారు. డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న పోలీసులు.. బస్సు మొత్తం సోదాలు నిర్వహించారు. ఓ సీటు కింద దాచిన పెట్టెలో ఒక క్వింటాల్ 40 గ్రాముల వెండిని అభరణాల రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వెండి విలువ సుమారు రూ.86,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించగా.. సమాధానం కూడా చెప్పలేకపోయాడని అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
నడుము బెల్ట్‌లో 16 కిలోల బంగారం..
మహారాష్ట్రలోని ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.8.40 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి వచ్చి అతడు.. నడుముకు పెట్టుకున్న బెల్ట్‌లో 16 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్కా సమాచారం ప్రకారం.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన అతడ్ని అదుపులోకి తీసుకుని సోదాలు జరిపామని చెప్పారు.