Road Accident Gujarat: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవళ్లీ జిల్లా మోడాసా తాలూకా కోలిఖర్, అలంపుర్ గ్రామాల మధ్య మూడు ట్రక్కులు, ఓ కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఓ ట్రక్కులో రసాయనాలు ఉండడం వల్ల పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 9.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న మోడాసా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కారు-ట్రాక్టర్ ఢీ.. ఉత్తర్ప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ కారు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్న ఘటనలో పెళ్లిబృందానికి చెందిన ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. గసాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణ్‌పుర్ నుంచి భగవాన్‌పుర్‌కు వెళ్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను బసంత్ (32), అమృత (28), లక్ష్మణ్ (40), వాడి (35), షాదాబ్ (26), అంకిత్ (13)గా పోలీసులు గుర్తించారు.