Best Hill Stations in Telangana and Andhrapradesh :మీరు నేచర్ లవర్సా..? ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటారా..? అయితే.. ఇది మీకోసమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాల అందాలు పర్యటకులను కట్టిపడేస్తాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, ఎత్తయిన కొండలు, లోయలు, గుహలు, మంచినీటి సరస్సులు మీకు మర్చిపోలేని గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. మరి అవి ఏవి? ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. అనంతగిరి హిల్స్ :
అనంతగిరి కొండలు హైదరాబాద్‌కుసమీపంలో ఉండే దగ్గరి హిల్ స్టేషన్‌లలో ఒకటి. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో ఉంటుంది. అనంతగిరి కొండలు తెలంగాణలోని అతిపెద్ద దట్టమైన అటవీ ప్రాంతం. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవి.. ప్రకృతి ప్రేమికులను మైమరిపింప చేస్తుంది. అడవి మధ్యలో ఉన్న 1300 సంవత్సరాల చరిత్ర గల అనంత పద్మ నాభస్వామి ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది.
అనంతగిరి కొండలను 'తెలంగాణ ఊటీ'గా పిలుస్తారు. వికారాబాద్ నుంచి అనంతగిరికి వెళ్తుంటే దారి పొడవునా ఉండే పచ్చని చెట్లు పర్యటకులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. ఎత్తయిన కొండలు, పచ్చటి చెట్లు, ఇరుకైన లోయలు, స్వచ్ఛమైన గాలి, మంచినీటి సరస్సులు మంచి అనుభూతిని సందర్శకులకు కలిగిస్తాయి. మీరు స్నేహితులతో కలిసి వెళ్తే సరదాగా నాగసముద్రం సరస్సు దగ్గరికి వెళ్లవచ్చు.
- హైదరాబాద్ నుంచి దూరం 75 కి.మీ
- ప్రదేశం : వికారాబాద్, తెలంగాణ
- అక్టివిటీస్ : ట్రెక్కింగ్, బోటింగ్, ప్రకృతి నడకలు, ఫొటోగ్రఫీ
- తప్పక చూడాల్సిన ప్రదేశాలు : భవనాసి సరస్సు
పచ్చదనంతో నిండిన అనంతగిరి కొండలు చూశారా..?
2. శ్రీశైలం
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాహస యాత్రలు చేయాలనుకునేవారికి.. శ్రీశైలం హిల్ స్టేషన్ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ హిల్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉంది. ఇక్కడ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించేవి ఆధ్యాత్మిక క్షేత్రాలు, గుహలు, బోటింగ్, దట్టమైన అడవులు, ఘాట్ రోడ్, జలపాతాలు, లోయలు. కొండపైన ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయాన్ని సందర్శకులు తప్పక చూడాలి.
శ్రీశైలంలో మరొక మనోహరమైన పుణ్యక్షేత్రం ఉంది. అదే ఉమా మహేశ్వరం ఆలయం. ఈ ఆలయం చుట్టూ అనేక జలపాతాలు ఉన్నాయి. ఇంత గొప్ప పర్యాటక కేంద్రంగా ఉన్న శ్రీశైలం అటవీ ప్రాంతంలో అనేక జీవరాశులు ఉన్నాయి. నాగార్జున సాగర్-శ్రీశైలం అభయారణ్యం పులులు, చిరుతపులులు, వివిధ జింకలు, మొసళ్లు, ధోల్‌లకు నిలయంగా ఉంది. వన్యప్రాణులను దగ్గర నుంచి చూడాలనుకునే వారి కోసం జీప్ సఫారీని ఏర్పాటు చేశారు. శ్రీశైలం కొండ ప్రాంతాలలో ఎక్కువ భాగం నల్లమల అడవి విస్తరించి ఉంటుంది.
- ప్రదేశం : కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
- అక్టివిటీస్ :గుహ అన్వేషణ, ట్రెక్కింగ్, వన్యప్రాణులను చూడటం.
- తప్పక చూడాల్సిన ప్రదేశాలు : మల్లికార్జున దేవాలయం, శ్రీశైలం ఆనకట్ట, మల్లెలతీర్థం.
3. నల్లమల కొండలు :
నగరంలోని గజిబిజి జీవితం నుంచి రిలాక్స్ కావాలనుకుంటే.. నల్లమల కొండలను చూడాల్సిందే. కృష్ణా, పెన్నా నదులు నల్లమల పర్వత శ్రేణిని అనుకొని ప్రవహిస్తుంటాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. 15వ శతాబ్దంలో మానవులు నిర్మించిన కంబం సరస్సు అబ్బుర పరుస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. మీరు ఇక్కడ స్థానిక తెగలతో మాట్లాడి, వారి జీవన విధానం గురించి తెలుసుకోవచ్చు. భైరాణి కొండ, గుండ్ల బ్రహ్మేశ్వర పేరుతో ఉన్న కొండలు రెండు వేల మీటర్ల ఎత్తులో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వీటిన ఎక్కితే చుట్టు పక్కల ప్రాంతాలు పచ్చదనంతో కనువిందు చేస్తాయి. ఈ హిల్ స్టేషన్‌లో అనేక రాతి నిర్మాణాలు కూడా ఉన్నాయి.
- ప్రదేశం : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మీదుగా విస్తరించి ఉంది.
- అక్టివిటీస్ : ట్రెక్కింగ్, సందర్శనా స్థలాలు.
- తప్పక చూడాల్సిన ప్రదేశాలు : మహానది ఆలయం, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్, కంబం సరస్సు.