గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా పుష్పయాగం - చిత్తూరు జిల్లా వార్తలు
కరోనా నేపథ్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగం ఏకాంతంగా జరిగింది. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం పుష్పయాగం జరిగింది. 10 రకాల పుష్పాలు, 4 రకాల పత్రాలు కలిపి దాదాపు 2 టన్నుల పూలను పుష్పయాగానికి వినియోగించారు. పుష్పాలను తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల దాతలు విరాళంగా అందచేశారు. మే 18 నుంచి 26 వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.