Youngman Died of Heart Attack: ఆస్పత్రిలోకి నో ఎంట్రీ.. గుండెపోటుతో యువకుడు మృతి - youngman died of heart attack at Gudivada hospital
Young Man Died of Heart Attack: గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి లోపలికి వెళ్లేందుకు దారిలేక నిండు ప్రాణం బలైంది. ఆసుపత్రి అభివృద్ధి పేరుతో ప్రధాన గేటును మూసివేయడంతో సకాలంలో చికిత్స అందక గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చూపరులను కలచివేసింది. ఐరన్ రాడ్‌ల మధ్య నుంచి పేషెంట్‌ను భుజాలపై వేసుకుని తిరిగిన దృశ్యం పట్టణవాసులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఆర్చి నిర్మాణం నిమిత్తం ఆస్పత్రి ప్రధాన ద్వారంతో పాటు వెనుక మార్గాన్ని కూడా ఐరన్ రాడ్‌లతో మూసివేశారు. ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి.
మంగళవారం పట్టణానికి చెందిన యువకుడికి గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు అతడిని ఆటోలో హుటాహుటిన గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ప్రధాన ద్వారం మూసిఉండటంతో.. అక్కడే ఉన్న కొందరు వెనుక ద్వారం గుండా లోపలికి వెళ్లాలని చెప్పారు. పరుగున హాస్పిటల్ వెనుక ద్వారం వైపునకు తీసుకువెళ్లగా అక్కడా గేటు మూసి ఉండటంతో వారికి చుక్కెదురైంది. తిరిగి ప్రధాన ద్వారం గుండా యువకుడిని భుజాన వేసుకుని లోపలికి పరుగు పరుగున వెళ్లారు. కనీసం స్ట్రెచర్ కూడా వెళ్లలేని పరిస్థితి. నానా అవస్థలుపడి యువకుడిని వైద్యుల వద్దకు తీసుకుని వెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. అరగంట పాటు ఆసుపత్రి ద్వారాల వద్ద జరిగిన జాప్యం కారణంగా యువకుడు మృతి చెందాడని, సకాలంలో వైద్యం అందితే యువకుడు బతికేవాడని స్థానికులు అంటున్నారు. ముందుగా ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు రోగిని తీసుకువెళ్లారని, అక్కడే మృతి చెందాడని మృతుడిని పరీక్షించిన వైద్యులు చెప్పారంటూ సూపరింటెండెంట్ వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించాయని బంధువులు ఆరోపిస్తున్నారు.