ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా సాక్షి ఎడిటర్- హైకోర్టు హెచ్చరించినా మారని జగన్ తీరు - YCP Govt Appointed Sakshi Editor
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 10:28 AM IST
|Updated : Dec 20, 2023, 10:45 AM IST
YCP Govt Appointed Sakshi Editor as Public Policy Adviser: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలు పలుమార్లు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రి తీరు మారటం లేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు సలహాదారుల నియామకాలేంటని రాష్ట్ర హైకోర్టు హెచ్చరించిన పట్టించుకోవటం లేదని దుయ్యబడుతున్నారు. తాజాగా సొంత పత్రిక 'సాక్షి'లో పని చేసిన నేమాని భాస్కర్‌ను ప్రభుత్వ ప్రజా విధానాల (పబ్లిక్ పాలసీ) సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడుతున్నారు.
People Fire on CM Jagan Administration: రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ సలహాదారును నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటివరకు సాక్షి ఎడిటర్‌గా పని చేసిన నేమాని భాస్కర్ (ఎన్‌వీవీఎస్ భాస్కర రామం)కు ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారు పదవిని కట్టబెడుతూ ఆ శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నేమాని భాస్కర్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించిన శ్రీరామచంద్రమూర్తి ఆ పదవికి రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో నేమాని భాస్కర్‌ను నియమించినట్లు వెల్లడించింది. దీంతో జగన్ కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రికలో పని చేసిన వారికి ప్రభుత్వ పదవులను కట్టబెట్టడం అధికార దుర్వినియోగం కాదా?, అస్మదీయులను సలహాదారు పోస్టుల్లో నియమించి, ప్రజాధనాన్ని వృథా చేయడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.