YCP Fake Voter ID Cards: వైసీపీ కక్కుర్తికి పరాకాష్ట.. 16ఏళ్లకే ఓటరు గుర్తింపు కార్డు..! - నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు
YCP Fake Voter ID Cards: వైసీపీ నేతలు తమ అధికార బలాన్ని ఉపయోగించి పదిహేను, పదహారేళ్ల పిల్లలకు కూడా ఓటు హక్కును కల్పించారు. ఈ ఉదంతం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలంలో వెలుగు చూసింది. చోళసముద్రం గ్రామానికి చెందిన ఓ బాలుడు పుట్టిన తేదీ ఆధార్ కార్డులో 1౼1౼2007గా ఉంది. ఈ లెక్క ప్రకారం అతడికి పదహారేళ్లు.. కానీ 1౼1౼2004 పుట్టిన తేదీగా.. ఎన్నికల అధికారులు ఈ ఏడాది జనవరిలో ఆ బాలుడికి ఓటరు కార్డు జారీ చేశారు. ఈ విషయం తాజాగా ఓటరు జాబితా పరిశీలనలో వెలుగు చూసింది. దాన్ని తొలగించాలని టీడీపీ బీఎల్ఏలు అభ్యంతరం తెలిపినా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, బాలుడి తండ్రి అధికార పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నట్లు సమాచారం. దాంతో ఓటు తొలగింపునకు ప్రతిపాదించడానికి కూడా స్థానిక అధికారులు సాహసం చేయడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇదే గ్రామంలో 15 ఏళ్ల లోపు వయసున్న పది మందికి పైగా పిల్లలకు అధికార పార్టీ నేతలు ఓటు హక్కు కల్పించారని స్థానికులు ఆరోపించారు.