WOMEN PROTEST FOR WATER: మంచినీరు కలుషితం.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన - వైఎస్సార్ జిల్లా లేటెస్ట్ న్యూస్
WOMEN PROTEST FOR WATER: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని తోలగంగనపల్లె తెరిసా నగర్ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తమ కాలనీలోకి వచ్చే మంచినీటి పైపులైన్లో మురుగు నీరు కలిసి.. దుర్గంధం వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీటిని ఎలా తాగాలని.. మిగిలిన అవసరాలకు ఎలా వాడుకోవాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మురికి నీటిని తాగటం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టిలోకి ఎన్నిసార్లు తీసుకెళ్లినా లాభం లేదని వాపోతున్నారు.
కాగా గతంలో వర్షాకాలంలో రోడ్డుపైకి నీళ్లు నిలుస్తున్నాయని మంచినీటి పైపులైన్ మీదనే చిన్న కాలువను ఏర్పాటు చేశారు. ఆ కాలువను కాలనీవాసులు పూర్తిగా డ్రైనేజీ కాలువలా వాడుతున్నారని, దాని కింద ఉన్న త్రాగునీటి పైపులైన్ రంధ్రాలు పడి వాటి నుంచి నీరు కలుషితమై తమకు వస్తున్నాయని తెలిపారు. ఆ నీటిలో పాచి, మరికొన్ని వ్యర్థాలు వస్తున్నాయని.. వాటిని ఎలా తాగాలంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సచివాలయంలో చాలాసార్లు అధికారులకు చెప్పినప్పటికీ వారు పట్టించుకోవటంలేదని మహిళలు తెలిపారు. ఒకవేళ వారు వచ్చినా నామమాత్రంగా చూసి వెళ్తున్నారే తప్ప తమ సమస్యను పరిష్కరించేవారే లేరంటూ మహిళలు తెలిపారు.
గ్రామంలోని నాయకులకు, సచివాలయ అధికారులకు, పోలీసు అధికారులకు ఇలా ఎంతమందికి తమ సమస్య గురించి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి మురుగునీటి కాలువను పూడ్చి మంచినీటి పైపులైన్ మరమ్మతులు చేసి.. తమకు మంచినీరు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.