Volunteer Rude Behavior with BLO: వాలంటీర్ దౌర్జన్యం.. బీఎల్వో చేతిలోని ఓటర్ల జాబితాను లాగేసుకుని.. - volunteer rude behavior with BLO
Volunteer Rude Behavior With BLO: రాష్ట్రంలో వాలంటీర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వాలంటీర్లపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. మరోవైపు వాలంటీర్లు చేస్తున్న నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అధికారుల మాటలను సైతం లెక్కచేయడం లేదు. ఇవే కాకుండా పలు నేరాలకు కూడా పాల్పడుతున్నారు. దొంగతనాలు చేస్తూ.. హత్యలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా సత్యసాయి జిల్లాలో వాలంటీర్ చేసిన పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వైసీపీ నాయకుల అండతో వాలంటీర్లు రెచ్చిపోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలన్న ఎన్నికల కమిషన్ హెచ్చరికను సైతం తుంగలో తొక్కుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు సచివాలయం 246 పోలింగ్ బూత్‌లో.. వాలంటీరు బయ్యారెడ్డి బీఎల్వో చేతిలోని ఓటర్ల జాబితాను లాగేసుకున్నారు. వాలంటీర్ సర్వేకు రాకూడదని బీఎల్వో చెబుతున్నా పట్టించుకోలేదు. నా ఓటు చూసుకుంటున్నానంటూ జాబితాను తీసుకున్నారు. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా సదరు వాలంటీర్ పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు.. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వాలంటీరు వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.