పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన - ట్రాఫిక్ జామ్తో వాహనదారుల ఇబ్బందులు - andhra pradesh traffic problems
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 4:54 PM IST
|Updated : Nov 7, 2023, 5:41 PM IST
Traffic Problems with CM Jagan Tour in Puttaparti: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉందంటే చాలు వాహనదారులు హడలిపోతున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల కోసం సీఎం జగన్ పర్యటించారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో సభ ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల కొద్దీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల అవగాహన లోపం కారణంగా సత్యసాయి హాస్పిటల్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. దీనివల్ల హాస్పిటల్కు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పుట్టపర్తికి వచ్చే పర్యటకులు అయితే సభ ముగిసే వరకు వేచి చూడవలసి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ రావడానికి గంట ముందు నుంచే వాహనాలను అధికారులు నిలిపివేయడంతో ప్రజలు ఆసహనం వ్యక్తం చేశారు. సభ ముగిసిన తర్వాత వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు పంట పొలాల మధ్య నుంచి రాకపోకలు కొనసాగించారు.
Public Left from Meeting: పుట్టపర్తిలో ముఖ్యమంత్రి సభ జరుగుతుండగానే జనం బయటికి వెళ్లిపోయారు. ఉదయం నుంచి సభలో ఉన్న జనం.. సీఎం జగన్ ప్రసంగం పూర్తికాక ముందే అక్కడి నుంచి నిష్క్రమించారు. చుట్టూ కట్టిన బారికేడ్లను దాటుకుని, అక్కడున్న గుట్టలపైకి ఎక్కి మరీ బయటపడ్డారు. పోలీసులు అడ్డుచెబుతున్నా పట్టించుకోకుండా... ఇక్కడి నుంచి వెళ్లిపోతే చాలు అన్నట్లుగా సభ నుంచి వచ్చేశారు.