Theft: చంద్రగిరిలో రెచ్చిపోయిన దొంగలు.. ఒకే రాత్రిలో మూడు ఇళ్లలో చోరీ - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్
Thieves targeted 3 houses: తిరుపతి జిల్లాలోని చంద్రగరిలో దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని అర్ధరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఇలా ఒకే రాత్రిలో మూడు ఇళ్లలో ఉన్నదంతా దోచుకుని ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. చంద్రగిరి పట్టణంలోని కొత్తపేట శ్రీశ్రీ నగర్లో కాపురం ఉంటున్న ఈశ్వరి కుటుంబమంతా సోమవారం అనంతపురానికి వెళ్లింది. కాగా అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటి తాళాలను పగలగొట్టిన దుండగులు కప్‌బోర్డ్‌లో దాచిన బంగారం నగలు దోచుకెళ్లారు. అలాగే విజయనగర్ కాలనీకి చెందిన సుమతి కుటుంబం తాళాలు వేసుకుని మేడపై నిద్రిస్తోంది. అదును చూసిన దొంగలు ఆమె ఇంట్లో కూడా తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. మరోవైపు సుమతి ఎదిరింట్లో ఉంటున్న మేఘన కుటుంబం ఇంటికి తాళాలు వేసి తిరుపతికి వెళ్లింది. మేఘన ఇంట్లో కూడా చొరబడిన దొంగలు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మూడు చోరీల ఘటనల్లో ఎంత నగదు, బంగారాన్ని దొంగలు దోచుకున్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూ టీంలకు సమాచారం అందించారు. పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడిన దుండగులు బాధితురాలు ఈశ్వరి ఇంటి సమీపంలో స్నానం చేసి.. టవల్, సోప్‌ను అక్కడే వదిలి పెట్టి వెళ్లినట్లు సమాచారం. కాగా ఎవరూ లేరని తెలిసే.. దుండగులు పక్కా ప్రణాళికతో వరుస చోరీలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.