Stickers: వైసీపీ Vs టీడీపీ.. అంతా స్టిక్కర్ల మయమే..! - ys jagan comedy videos
Campaign with stickers in AP: రాష్ట్రంలో స్టిక్కర్లమయం కొనసాగుతోంది. అధికార పార్టీ వైసీపీ 'జగనన్నే మా భవిష్యత్' పేరుతో ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ను ఎందుకు నమ్మాలంటూ.. గుంటూరులో తెలుగు యువత వినూత్న ప్రచారం చేపట్టింది. "మాకు నమ్మకం లేదు జగన్" అంటూ రూపొందించిన స్టిక్కర్లను ఇళ్లతో పాటు వాహనాలకు అంటిస్తూ ప్రచారం నిర్వహించారు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, జాబ్ క్యాలెండర్లు, మెగా డీఎస్సీలంటూ నిరుద్యోగులను మోసం చేశారని, మహిళలకు రక్షణ కల్పిస్తా, సీపీఎస్ రద్దు చేస్తా వంటి రకరకాల హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని.. తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆరోపించారు.
ప్రజల సొమ్ముతో అధికార దుర్వినియోగం చేస్తూ.. 'మా నమ్మకం నువ్వే జగన్' అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కపట వైఖరిని నిరసిస్తూ " మాకు నమ్మకం లేదు జగన్ " పేరుతో స్టిక్కర్లు అంటిస్తున్నట్లు వివరించారు. వైసీపీ అంటించిన స్టిక్కర్ల వద్దే వీటిని కూడా అంటించటం విశేషం. యజమానుల అంగీకారం మేరకే ఈ స్టిక్కర్లు అతికిస్తున్నట్లు స్పష్టం చేశారు.