Maganti Babu: వివేకా హత్య కేసులో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు: మాగంటి బాబు - ఏలూరు జిల్లా లోకల్ వార్తలు
EX MP Maganti Babu allegations on jagan: వివేకానంద రెడ్డి హత్య కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని మాజీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. ఏలూరులోని తన నివాసంలో భవిష్యత్తుకు గ్యారెంటీ గోడ ప్రతులను ఆవిష్కరించిన ఆయన.. నాలుగేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని బాబు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డికి దోచుకోవడమే తప్ప పాలించడ చేతకాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయని, వాటిని ఏం చేయాలో తెలీక పెట్టెల్లో పెట్టి తోటల్లో దాస్తున్నారన్నారని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లిందని మాగంటి బాబు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా చంద్రబాబుకు ఉందని మాగంటి బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. 160కి పైగా సీట్లలో గెలిచి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ గెలవాలని మాగంటి బాబు ఆకాంక్షించారు. అంతుకుముందు తన నివాసంలో ఆయన ఎన్టీఆర్, తన తండ్రి రవీంద్రనాథ్ చౌదరి విగ్రహాలకు నివాళులు అర్పించి.. భవిష్యత్తుకు గ్యారంటీ గోడ ప్రతులను ఆవిష్కరించారు.