అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం - Swarna Pusparchana Utsavam
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 9:57 PM IST
Swarna Pusparchana Utsav at Simhachalam :సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం సింహాచల పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా స్వర్ణ పుష్పార్చనన్ని నిర్వహించారు. వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకులు మెుదట ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై స్వామిని అధిష్టింపజేశారు.
అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వామి వారి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొన్న భక్తులు ఉత్సవాన్ని చూసి తరించారు. విశేష ఆదరణ ఉన్న ఆర్జిత సేవలలో స్వర్ణ పుష్పార్చన ఒకటి. రూ. 2016 చెల్లించిన దంపతులకు ఈ స్వర్ణ పుష్పార్చన ఉత్సవానికి అనుమతించారు. ఎంతో మంది భక్తులు ప్రత్యక్షంగా స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. నేడు స్వామి వారు స్వర్ణకవచంలో భక్తులకు దర్శనమిస్తారు.