Snow in Konaseema: మండు వేసవిలో మంచు కురిసే.. చూపరులు మురిసే - ap news
Snow in Konaseema: రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కానీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. గత కొన్ని రోజులుగా పగలంతా ఎండల తీవ్రత.. సాయంత్రం వేళ చల్లగాలులు, మేఘాలతో వాతావరణ పరిస్థితులు ఉండేవి. దీంతో ఎండల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఈ రోజు ఉదయం నుంచి దట్టమైన మంచు కురవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారిని.. మంచు కురుస్తున్న అరుదైన దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉదయాన్నే మంచు దుప్పటి దట్టంగా కప్పేయడంతో వివిధ పనులకు వెళ్లేవారు దారి కనిపించక పోవడంతో ఇబ్బందులు పడ్డారు. పంట పొలాల్లో మంచు కురుస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. రహదారులకు ఇరువైపులా ఉన్న కొబ్బరి చెట్లు, వాటిపై మంచు పడుతున్న దృశ్యాలను చూసి యువత ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. మంచు కురుస్తున్న దృశ్యాలు తెగ ఆకట్టుకున్నాయి.