Students Fell Ill Due to Contaminated Food: కలుషిత ఆహారం.. 50 మందికిపైగా అస్వస్థత.. వారంతా..! - ఏలూరు జిల్లాలో విద్యార్థులు అస్వస్థత
Students Fell Ill Due to Ate Contaminated Food in Eluru: కలుషిత ఆహారం తిని 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని జవహర్ నవోదయ పాఠశాలలో చోటుచేసుకుంది. నవోదయ విద్యాలయంలో ఈ నెల 2 నుంచి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికలు నిర్వహిస్తుండగా.. పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి సుమారు 194 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు రోజుల నుంచి పోటీలు జరుగుతుండగా.. విద్యార్థులకు శుక్రవారం రాత్రి వండిన ఆహారాన్నే శనివారం ఉదయం కూడా పెట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో సుమారు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. వారంతా వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. హుటాహుటిన పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించి.. మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.