"విద్యార్థులకు ఉపయోగం లేని బైజూస్ కంటెంట్ - ఉపాధ్యాయ పోస్టుల భర్తీతోనే నాణ్యమైన విద్య" - బైజూస్ వద్దని ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 3:42 PM IST
Student Unions Agitation on Byjus APP: రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో భాగంగా అరండల్‌పేట లోని బైజూస్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవటంతో అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు బైజూస్ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు నాయకులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.
దివాలా తీస్తున్న బైజూస్ సంస్థకు అప్పనంగా వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌కు ఏటా రూ 3200 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుందని వారు ఆరోపించారు. కంటెంట్ లేని బైజూస్ తో ఒప్పందం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బైజూస్ యాప్‌లోని కంటెంట్ ద్వారా విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తేనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు.