Siberian Birds Died: విడిది కోసం వచ్చి.. తిరిగిరాని లోకాలకు సైబీరియన్ పక్షులు - Siberian Birds Died
Siberian Migratory Birds Died: శ్రీసత్యసాయి జిల్లాలోని వీరాపురం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి.. సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు మృత్యువాతపడ్డాయి. గాలివాన బీభత్సానికి.. చెట్లపై నుంచి కింద పడి సుమారు 100 సైబీరియన్ పక్షులు చనిపోయాయి. పెద్ద సంఖ్యలో పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి. కొన్ని పక్షులు రెక్కలు విరిగి గ్రామంలో తిరుగుతున్న దృశ్యాలు గ్రామస్థులను కలచివేస్తున్నాయి. దెబ్బతిన్న పక్షులు ఎగరలేక గ్రామంలో దీనంగా తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతానోత్పత్తి కోసం సైబీరియా నుంచి చిలమత్తూరు మండలంలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు వలస వచ్చిన సైబీరియన్ పక్షులు ఇలా ఒక్కసారిగా వందలాది మృతి చెందడంతో.. గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు. వలస పక్షులకు విడిది కేంద్రాలైన వీరాపురం, వెంకటాపురంలో.. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతోనే.. పక్షులు మృతి చెందాయని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలో పక్షుల స్థావరాల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గాయపడ్డ పక్షులకు వైద్యులు.. వైద్యసేవల అందించి పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే బెంగళూరు నుంచి వైద్యులను పిలిపించి చికిత్స చేయించి వాటిని పర్యవేక్షిస్తామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. గాయపడ్డ పక్షులకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు.