Sarpanch Protest: సర్పంచుల విన్నపాలు వినని వైసీపీ సర్కార్.. అరగుండుతో నిరసన - latest news on Surpanches Haircut Agitation
వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు కనీస గౌరవం దక్కటం లేదంటూ గుంటూరులో సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లాకు చెందిన వివిధ గ్రామాల సర్పంచులు డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద అరగుండు కొట్టించుకుని సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచులకు నిధులు, విధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. సర్కారు వైఖరితో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, కనీసం ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలు మార్చిందని ఆరోపించారు. కనీసం ఉత్సవ విగ్రహాలైనా ఏడాదికోసారి పూజలు అందుకుంటాయని, కానీ సర్పంచులకు ఏ రోజు కూడా గౌరవం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండు చేయించుకుంటే మూడు నెలల్లో మళ్లీ వెంట్రుకలు వస్తాయని... కానీ ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయన్న నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.