ఆర్టీసీ విలీనం పేరుతో ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వం మోసం చేసింది : తులసీరామ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 4:15 PM IST
RTC Contract Outsourcing Workers Strike in Vijayawada : వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం పేరుతో ఉద్యోగులను, కార్మికులను మోసం చేసిందని ఆర్టీసీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ వి.తులసీరామ్ విమర్శించారు. కార్మిక సంఘాలను బలహీనపరిచి ఉన్న హక్కులను కాలరాస్తున్నారని, ఆర్టీసీలో అభివృద్ధి రివర్స్ లో ఉందని మండిపడ్డారు. తులసీరామ్ యూటిఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిటైర్ అయిన వారి ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తుందని తెలిపారు. ఆర్టీసీలో థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి, ఔట్సోర్సింగ్ కార్మికులకు, సిబ్బందికి సంస్థ ద్వారానే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం నెలకి రూ. 26,000 ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వం వల్ల గతంలో ఉన్న సౌకర్యాలను సైతం.. కార్మికులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ పొందిన వారికి ఆర్టీసీ ద్వారా కనీసం వైద్యం కూడా అందించడం లేదని.. వారు రోడ్డున పడ్డారని తెలిపారు. సంస్థను అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కనీసం ఒక బస్సును కూడా కొనలేదని మండిపడ్డారు. ప్రస్తుతం 15 ఏళ్లు గా కాలం చెల్లిన బస్సులను రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తిప్పుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 27, 28 విజయవాడలో నిర్వహించే మహాధర్నాకు కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.