MPP Kavita on MLA: అభివృద్ధి లేదు అవినీతే.. ఎమ్మెల్యే తిప్పేస్వామిపై ఎంపీపీ ఆరోపణ - AP Latest News
MPP Kavita accused MLA Thippeswamy: మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడుతున్నారంటూ.. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండల వైసీపీ ఎంపీపీ కవిత తీవ్రంగా ఆరోపణ చేశారు. వ్యవసాయశాఖ రైతులకు ఉచితంగా వేరుసెనగ మినీకిట్లు పంపిణీ చేస్తోంది. ఈ మినీకిట్లు రైతులకు అందకుండా.. వైసీపీ ఎమ్మెల్యే అనుచరులే తీసుకెళుతున్న విషయంపై ఎంపీపీ కవిత భర్త రంగే గౌడ్, రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారంటూ.. రైతు భరోసా కేంద్రానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయటంతో వారు అక్కడికి చేరుకొని మరో తాళంచెవితో తలుపులు తెరిచారు. అనంతరం సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగే గౌడ్‌పై పోలీసులు కేసుపెట్టారు. దీనిపై స్పందించిన ఎంపీపీ కవిత ఎమ్మెల్యే తిప్పేస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు. విత్తన మినీకిట్లు ఎమ్మెల్యే అనుచరులే తీసుకెళుతున్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడుతున్నారని, సిమెంట్‌లో అవినీతి, అంగన్ ఉద్యోగాల్లో పెద్దఎత్తున అవినీతి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
TAGGED:
వైసీపీలో వర్గపోరు