Damage roads in Guntur : రోడ్లను అభివృద్ధి చేయాలని నాట్లు వేసి మహిళల నిరసన
Roads damaged due to overloaded lorries : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. అధిక లోడుతో ఇసుక లారీలు వెళ్లడం వలన రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీలను ఆపేసిన గ్రామస్థులు నిరసనకు దిగారు. భారీ వాహనాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని అధికారులకు చెబుతున్నా పట్టించుకోవటం లేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో కొల్లిపర్ల మండలం ఇసుక రీచ్‌ల నుంచి వస్తున్న లారీలను మూడు గంటల పాటు గ్రామస్థులు నిలిపివేశారు. పరిమితికి మించిన లోడ్‌తో వాహనాలు వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాడైపోయిన రోడ్లలో నీళ్లు నిలిచిపోవటంతో గుంతలుగా మారిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ బాధలు అని ప్రజలు వాపోతున్నారు . గ్రామంలోని రోడ్లను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నాట్లు వేసి మహిళలు నిరసన తెలిపారు. రహదారులు బాగు చేయకుండా ఇలా భారీ వాహనాలు ఈ మార్గంలో వెళ్తే తాము మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్థులు అవేదన చెందుతున్నారు.