ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరదలో చిక్కుకుపోయిన కుక్కపిల్లలను కాపాడిన పోలీసులు

By

Published : Jul 29, 2023, 5:21 PM IST

ETV Bharat / videos

Puppies Trapped in Flood: వరదలో చిక్కుకున్న కుక్కపిల్లలు.. తల్లి ఆరాటం.. కాపాడిన రెస్క్యూ టీమ్​

Puppies Trapped in Flood: సృష్టిలో తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు. పిల్లలకు ఏదైనా కష్టం వస్తే.. తల్లిపేగు తల్లడిల్లిపోతుంది. అది ఏ జీవికైనా ఒకటే.. తల్లి మనసు, ప్రేమకు సాటి మరేదీ లేదు. దీనికి అద్దం పట్టే సంఘటనలు మనం చాలానే చూస్తుంటాం... ఇలాంటి ఘటనే తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఓ శునకం వరదలో చిక్కుకుపోయిన తన పిల్లల కోసం ఎంతగానో ఆరాటపడింది. శునకం పరిస్థితిని గమనించిన రెస్క్యూ బృందం.. పిల్లలను తల్లి వద్దకు చేర్చి మానవతాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన చూసిన వారంతా ఏ జీవికి అయినా తన పిల్లల పట్ల మమతానురాగాలు ఇలాగే ఉంటాయని చెబుతున్నారు. ఈ సంఘటన నందిగామ మండలం ఐతవరం వద్ద జరిగింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా.. మునేరుకు వరదలు రావడంతో శునకం తన పిల్లలను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి.. ఎట్టకేలకు విజయం సాధించింది. నందిగామ మండలం ఐతవరం సమీపంలో గత రెండు రోజులుగా జాతీయ రహదారిపై వరద చేరిపోవటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి పక్కనే ఖాళీ చేసిన ఒక పెంకుటిల్లు ఉండగా.. ఓ శునకం రెండు పిల్లలకు అక్కడ జన్మనిచ్చింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆ ఇల్లు వరదలో చిక్కుకుపోయింది. ఇంటిలోపలే ఉండిపోయిన తన పిల్లలను కాపాడుకునేందుకు తల్లి కుక్క ఆరాటపడింది. దీన్ని గమనించిన రెస్క్యూ బృందం ఆ ఇంటి లోపలికి వెళ్లగా.. రెండు చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. వెంటనే ఆ రెండు పిల్లలను బయటకు తీసుకువచ్చారు. రెస్యూ టీమ్​.. శునకం పిల్లలను శుభ్రంగా కడిగి తల్లి వద్దకు చేర్చారు. అనంతరం తల్లి రెండు పిల్లలకు పాలు ఇచ్చి.. బిడ్డల ఆకలిని తీర్చింది. ఈ దృశ్యాలు చూపరుల మనసును కదిలించింది. 

ABOUT THE AUTHOR

...view details