Protest: సమస్యలు పరిష్కరించకుండా ఓట్ల కోసం వచ్చారా..! ఎమ్మెల్సీ భరత్‌ను ప్రశ్నించిన గ్రామస్థులు
Protest against YSRCP MLC Bharat: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయా..? లేదా..? అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీసేలోపు స్థానికుల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తున్నాయి. ఓట్లేసి గెలిపిస్తే.. ఈ నాలుగేళ్ల కాలంలో తమకు, తమ ఊరి అభివృద్ధికి ఏం చేశారంటూ..? గ్రామస్థులు నిలదీస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్‌కు నిరసన సెగ తగిలింది.
ఎమ్మెల్సీ భరత్‌కు నిరసన సెగ.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంటలో ఈరోజు 'గడప గడప మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్‌కు నిరసన సెగ తగిలింది. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా.. ఓట్ల కోసం వచ్చారా..? అంటూ గ్రామస్థులు నిలదీశారు. మౌలిక వసతుల మాటేంటంటూ.. ప్రజాప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని స్థానికులను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు వెనుదిరిగారు.
గ్రామ సమస్యలను ఎమ్మెల్సీకి చెప్పడం తప్పా..?.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని, గ్రామస్థుల సమస్యలను పరిష్కరించడానికి విచ్చేసిన అధికార పార్టీ ఎమ్మెల్సీని ప్రశ్నిస్తారా..? అంటూ నూలుకుంట పంచాయతీలోని వైఎస్సార్సీపీ నేతలు గ్రామస్థులతో గొడవకు దిగారు. దీంతో పలువురు గ్రామస్థులు స్పందిస్తూ.. తమ సమస్యలను ఎమ్మెల్సీకి చెప్పుకుంటే తప్పా..? అంటూ ప్రశ్నించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య, సీసీ రోడ్ల సమస్య, మురికి కాలువల వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్సీ భరత్‌ను స్థానికులు కోరారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకొని.. ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్సీతోపాటు వైసీపీ నాయకులు వెనుదిరిగారు.
ఇవీ చదవండి