Ycp Mla go back: ఆగ్రహంతో పీఏ చెంప చెళ్లుమనిపించిన వైసీపీ ఎమ్మెల్యే - mla kannababu news
YSR Congress MLA Kannababu Raju news: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు నిరసన సెగలు తప్పడం లేదు. ఓట్లేసీ గెలిపిస్తే తమ ఊరికి, యువతకు, రైతంగానికి ఏం చేశారంటూ.. సొంత పార్టీ కార్యకర్తలే నిలదీస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు రాజును గో బ్యాక్ అంటూ అక్కడ వైసీపీ యువత నినాదాలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పీఏ చెంప చెళ్లుమనిపించిన కన్నబాబు..అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు గో బ్యాక్ అంటూ అక్కడి వైసీపీ యువత నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉద్రిక్త సమయంలో ఆగ్రహంతో రగిలిపోయిన ఎమ్మెల్యే కన్నబాబు.. తన పీఏ చెంప చెళ్లు మనిపించారు. మరోవైపు ఈ కార్యక్రమం వల్ల పూడిమడకలో వైసీపీ వర్గవిభేదాలు బట్టబయలయ్యాయి. మత్స్యకారులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేను అక్కడి యువత ప్లకార్డులు చేతపట్టి నిలదీశారు.
ఎమ్మెల్యే కన్నబాబు గో బ్యాక్..ఏపీఐఐసీ పైప్లైన్ ప్యాకేజీ, నిరుద్యోగులకు ఉపాధి, గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కన్నబాబు గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేస్తూ నిరసన చేయడంతో ఎమ్మెల్యేకు విపరీతమైన కోపం వచ్చింది. తనను నిలదీస్తున్న వాళ్లపై దూసుకు వెళ్లేందుకు ఎమ్మెల్యే యత్నిస్తుండగా ఆయన్ని నిలువరించేందుకు ఎమ్మెల్యే పీఏ నవీన్ వర్మ ప్రయత్నించారు. దీంతో తననే చెయ్యి పట్టి వెనక్కి లాగుతావా? అంటూ పీఏ నవీన్ వర్మపై కన్నబాబు చేయి చేసుకున్నారు. మరోవైపు గ్రామంలో జరిగిన తోపులాట, నినాదాలతో ఆ ప్రాంతమంతా కొద్దిసేపు గందరగోళంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఎమ్మెల్యే కన్నబాబును ఆ ప్రాంతం నుంచి బయటికి తీసుకువచ్చారు.