Police Revealed Manappuram Gold Theft ఇంటిదొంగలే బంగారాన్ని కాజేశారు! మణప్పురం 10 కేజీల బంగారం చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు.. - kakinada manappuram news latest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 9:13 PM IST
Police Revealed Manappuram Gold Theft in Kakinada: కృష్ణా జిల్లా కంకిపాడు మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచి కార్యాలయంలో చోరీకి గురైన 10కేజీల 660గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంచే చేను మేసిన చందాన.. బ్రాంచ్ మేనేజరే ప్రధాన సూత్రదారిగా నడిపిన ఈ దొంగతనాన్ని చూసి.. పోలీసులే బిత్తరపోయారు. దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బ్రాంచ్ మేనేజర్ పావని, ఆమె సన్నిహితుడు దుర్గాప్రసాద్, మరో ఇద్దరు కలిసి అంచెలంచలుగా పది నెలల్లో బంగారాన్ని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 16న బంగారు చోరీకి గురైందని మణప్పురం బ్రాంచ్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసి కేసు ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులు తమ అదుపులో ఉన్నట్లు వారు వెల్లడించారు. వారి వద్ద ఉన్న మూడు కోట్ల 80లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జాషువా వివరాలను వెల్లడిస్తూ.. కేసును రోజుల వ్యవధిలో ఛేదించిన గన్నవరం డీఎస్పీ జై సూర్య, సీసీఎస్ డీఎస్పీ మురళీకృష్ణ ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.