NHM Employees: సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎన్హెచ్ఎం ఉద్యోగులు.. కట్ చేస్తే - వినతిపత్రం ఇవ్వటానికి వచ్చిన ఎన్హెచ్ఎం ఉద్యోగులు
Police Arrested NHM Employees at CM Camp Office: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్కు వినతిపత్రం ఇవ్వటానికి సీఎం క్యాంప్ ఆఫీసుకి వచ్చారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్కి తరలించారు. మరోవైపు విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. విజయవాడ, వారధి, తాడేపల్లిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎంలకు.. నర్సులతో పాటు సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతం పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో తీసుకువచ్చి వెనక్కు తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెగ్యులరైజ్ చేస్తానని చేయటం లేదని మండిపడ్డారు. కొత్తగా చేరిన వారికంటే తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఒకే పోస్టులో పని చేస్తున్న నర్సులకు, వారికి జీతాలు చెల్లించటంలో ప్రభుత్వం తారతమ్యాలు చూపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమ పిల్లలకు అమ్మబడి లాంటి ప్రభుత్వ పథకాలు అందటం లేదని.. జీతాలు ఇలా తక్కువగా చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన మాటిచ్చారని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని ఎన్హెచ్ఎం ఉద్యోగులు హెచ్చరించారు.