Police Arrested Women Farmers in Rythu Yatra: గుంటూరు ఛానెల్ పొడిగింపు కోసం రైతు యాత్ర.. పలువురు అరెస్ట్
Police Arrested Women Farmers in Rythu Yatra: సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం.. తాగునీటి సరఫరా కోసం గుంటూరు ఛానెల్‌ను పొడిగించాలంటూ చేపట్టిన రైతు యాత్ర అరెస్టులకు దారి తీసింది. తాడేపల్లి బయలుదేరిన రైతులు, మహిళలను.. పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో రహదారిపై బైఠాయించిన మహిళా రైతులను పోలీసులు ఈడ్చి పడేశారు. పోలీసులు బలవంతంగా.. వారిని వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాగునీరు ఇవ్వాలని అడుగుతుంటే ఈడ్చిపడేస్తారా అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా రైతు యాత్రను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు పలుచోట్ల వాగ్వాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి సీఎం ఇంటి వరకూ.. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు యాత్ర ప్రారంభించేందుకు నిర్ణయించారు. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారుల్లోనూ పోలీసులను మోహరించారు. అయితే రైతు యాత్రకు అనుమతి లేదంటూ ముందస్తుగానే రైతు సంఘ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పలువురిని గృహ నిర్భందాలు చేశారు. పెదనందిపాడు, నాగులపాడు, వరగాని, ప్రత్తిపాడు, ఏటుకూరు, ఐదోవమైలు వద్ద బారికేడ్లును ఏర్పాటు చేశారు. రైతు యాత్రను నిలువరించేందుకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేశారు. అనుమానంగా ఉన్న వారిని మధ్యలోనే ఆపేశారు. రైతు యాత్రకు వస్తున్న రైతులను పెదనందిపాడులో ఆర్టీసీ బస్సులను దించి అరెస్ట్ చేశారు.