NTR Family: "భావితరాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి అందించే కార్యక్రమాలు నిర్వహించాలి" - ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు
NTR Family Members: వెండితెర ఆరాధ్య నటుడు.. రాజకీయ దురంధరుడు.. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు. ఆయన రూపం సుమనోహరం, సమ్మోహనం, అభినయ వేదం. తన నటనతో తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం. అలాంటి ధీరుడి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. శత వసంతాల అంకుర్పారణ కార్యక్రమానికి విజయవాడ వేదికైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు, విశిష్ట అతిథిగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌లు హాజరుకానున్నారు. అలాగే ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలనే వారు విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, కుమార్తె లోకేశ్వరి, ఎన్టీఆర్ మనవడు శ్రీనివాస్ విజయవాడకు వచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించటం గర్వంగా ఉందని వారు తెలిపారు. భావితరాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి అందించే క్రమంలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నాన్నగారి శతజయంతి కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి తెలిపారు. తాతగారే తమ స్ఫూర్తి, ఆయన ఆశయాలు అందరికీ చేరాలని లోకేశ్వరి తనయుడు, ఎన్టీఆర్ మనవడు శ్రీనివాస్ ఆకాంక్షించారు.