Jayaho BC Meeting: అధికారంలోకి వచ్చాక.. బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్: నారా లోకేశ్ - నారా లోకేశ్
Nara Lokesh Comments: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటామని.. నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో.. 'జయహో బీసీ సదస్సు' నిర్వహించారు. బీసీ వృత్తులను అన్నివిధాలా ఆదుకుంటామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. బీసీలకు అవసరమైన ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. బీసీలకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తామని తెలిపారు. రజకులు, గాండ్ల సోదరులకు విద్యుత్ రాయితీ అందిస్తామని.. బీసీ, ఉపకులాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనేది తన లక్ష్యమన్న నారా లోకేశ్.. ప్రజల్లో పనిచేసే ప్రతిఒక్కరినీ బాగా ప్రోత్సహిస్తామన్నారు. కుటీర పరిశ్రమల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే బీసీ జనగణన కోసం పోరాడుతామన్నారు. బాపట్ల జిల్లాలో ఇటీవల దారుణహత్యకు గురైన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్.. బంధువులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని.. కన్నీటిపర్యంతం అయ్యారు. వారిని ఓదార్చిన లోకేశ్.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిందితులకు శిక్ష పడేలా చేస్తామని.. భరోసా ఇచ్చారు. అమర్‌నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టారని.. అమర్‌నాథ్‌గౌడ్ మృతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. గన్ కంటే ముందు జగన్ వస్తారని గతంలో చెప్పారు.. అమర్‌నాథ్‌గౌడ్ విషయంలో జగన్ ఏమయ్యారని నారా లోకేశ్ ప్రశ్నించారు. అమర్‌నాథ్ గౌడ్ సోదరిని.. తన తల్లి నారా భువనేశ్వరి చదివిస్తారని హామీ ఇచ్చారు.