CBI Investigation: 'తాము కొట్టినట్లు ఉండాలి.. అవినాష్ ఏడ్చినట్లు ఉండాలి.. ఇదే సీబీఐ తీరు'
Nakka Anand Babu accuses Avinash Reddy: వివేకా హత్య కేసులో సీబీఐ, ఆవినాష్ రెడ్డిల తీరు 'తాను కొట్టినట్లు ఉండాలి, నువ్వు ఏడ్చినట్లు ఉండాలి' అన్నట్లుగా.. ఉందనీ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. ఓ హత్యకేసు నిందితుడి అరెస్టు కోసం సీబీఐ స్థానిక పోలీసుల్ని బతిమలాడటం సిగ్గుచేటనీ మండిపడ్డారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఎస్పీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పటం దుర్మార్గమైన చర్య అని నక్కా ఆక్షేపించారు. శాంతిభద్రతలు పరిరక్షించలేమని పాలకులే ఒప్పుకుంటున్నప్పుడు ఇక ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చుగా అని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్లో ఎవరెవరి పేర్లో బయటకు వస్తాయని, జగన్మోహన్ రెడ్డి ఆవినాష్ రెడ్డిని కాపాడాలని చూస్తున్నారని నిలదీశారు.
తల్లికి బాగోలేకపోతే మంచి వైద్యం కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు తీసుకువెళ్లాలి కానీ.. అక్కడ ఆసుపత్రిలో ఆమెను ఉంచి అవినాష్ రాజకీయాలు చేస్తున్నారని నక్కా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం స్టేట్లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని నక్కా ఆరోపించాడు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరగాలంటే, సీబీఐ తమ చిత్తుశుద్దిని నిరూపించుకునేలా పని చేయాలని డిమాండ్ చేశాడు. కర్నూలు, కడప జిల్లా నుంచి జనాలను తీసుకువచ్చి సీబీఐ అధికారులను భయపట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నక్కా ఆరోపించారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు వెనకాడుతుందని ఆనంద్ బాబు ప్రశ్నించాడు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో సీబీఐ అంటే గౌరవం తగ్గే ప్రమాదం ఉందని నక్కా పేర్కొన్నాడు.