MLA Velagapudi at AU Skill Development Center: దాచేస్తూ దగా..! 'స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బోర్డు మార్పు.. బాబుపై అక్రమ కేసుకు ఇదే నిదర్శనం'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 7:48 PM IST
MLA Velagapudi at Au Skill Development Center: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. కళ్లముందు కనిపించే శిక్షణా కేంద్రాలను విశ్వసించని వైసీపీ ప్రభుత్వం.. వాటిని మసిపూసి మారేడుకాయ చేస్తోంది. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గత ప్రభుత్వం నెలకొల్పిన.. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం బోర్డు మార్చేసింది. గతంలో సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పేరిట బోర్డు ఉండగా దాన్ని తీసేసి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అని బోర్డు పెట్టారు. సీమెన్స్ పేరును పూర్తిగా తీసేసి.. ఏయూ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ అని ఫ్లెక్సీపెట్టారు.
బోర్డుపై ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లోగోనూ మాయం చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను మూసేసిన అధికారులు.. బోర్డులు మార్చేసి తిరిగి తెరిచారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును సిబ్బంది అడ్డుకున్నారు. అవేమీ లెక్కచేయకుండా లోపలికి వెళ్లిన రామకృష్ణ బాబు.. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల్ని మీడియాకు చూపించారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారనడానికి ఇదే నిదర్శనమన్నారు.