Jogi Ramesh : 'ఏయ్.. పక్కకు పో'.. డీఎస్పీపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం
Minister Jogi Ramesh : చుట్టూ ప్రభుత్వాధికారులు, ప్రముఖులు ఉన్న సమయంలో ఓ పోలీసు అధికారి పట్ల రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ దురుసుగా ప్రవర్తించారు. మచిలీపట్నం పర్యటనకు మంత్రి రోజా వచ్చిన సమయంలో.. మంత్రి జోగి రమేశ్ పోలీసు అధికారిని 'పక్కకు పో' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యవహరించిన తీరుపై అక్కడ ఉన్న పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే : కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా వచ్చారు. మంత్రి రోజాను ఆహ్వానించే క్రమంలో కృష్ణా జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. వారందరూ పుష్పగుచ్ఛాలతో ఆమెకు స్వాగతం పలుకుతున్న సమయంలో.. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కూడా స్వాగతం పలికేందుకు మంత్రి దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలో మంత్రి చుట్టూ ఉన్నవాళ్లను డీఎస్పీ మాన్షూభాషా పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జోగి రమేశ్.. డీఎస్పీని ఏయ్ పక్కకు పో అంటూ విసుక్కున్నారు. గత్యంతరం లేక డీఎస్పీ మాన్షూభాషా మిన్నకుండిపోయారు. పోలీసు ఉన్నాతాధికారులతో మంత్రి ప్రవర్తన తీరుపై.. ఘటనాస్థలంలో ఉన్న పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేశారు.