Minister Jogi Ramesh speech: 'ఇళ్ల నిర్మాణ వేదికపై ఊగిపోయిన మంత్రి జోగి రమేశ్.. సీఎం జగన్ చిరు నవ్వులు' - ఏపీ ముఖ్యవార్తలు
Minister jogi Ramesh: అధికార వైఎస్సార్సీపీ మంత్రులు అవకాశం అందితే చాలు.. ప్రతిపక్ష నేతలపై నోరుపారేసుకుంటున్నారు. అధికారిక కార్యక్రమంలోనూ ప్రతిపక్ష నేతలపై దూషణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జోగి రమేశ్.. తీవ్ర పదజాలం ఉపయోగించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెం సభలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ నోరుపారేసుకున్నారు. ముసలి నక్క, ఊరపంది, పిచ్చికుక్క అని వారిని సంబోధిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నికల సీజన్ రావడంతో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో తెలియని వారందరూ బయటకు వచ్చి మొరుగుతున్నారనీ.. వీరంతా చిత్తకార్తె కుక్కల వంటి వారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలపై జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే.. ముఖ్య మంత్రి జగన్ నవ్వులు చిందించారు. అలా నవ్వుతూనే సీఎం సైగలు చేశారు. అయినా ఆపకపోవడంతో, ఎమ్మెల్సీ తలశిల రఘురాముని పిలిచి చెవిలో ఏదో చెప్పారు. ఆయన.. జోగి రమేశ్ వద్దకు వెళ్లి చిన్నగా చెప్పడంతో ప్రసంగం ముగించారు.