భార్య, కుమారుడిపై పోలీసుల దాడి- మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Police attacks in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 1:58 PM IST
Man Attempts Suicide After Police Attack: పోలీసులు తన భార్య, కుమారుడిపై దాడి చేశారన్న మనస్థాపంతో నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఆకుల మద్దిలేటికి చెందిన మూడెకరాల భూమిని సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అప్పగించింది. పరిహారం మాత్రం ఇవ్వలేదు. ఈ నెల 8వ తేదీన శుక్రవారం ఆ భుమిలో పనులు చేసుకుంటున్న మద్దిలేటి భార్య చెన్నమ్మ, కుమారుడు హుస్సేన్లపై పోలీసులు దాడి చేసి బలవంతంగా పాణ్యం పోలీస్ స్టేషన్కు తరలించారు.
విషయం తెలుసుకున్న మద్దిలేటి మనస్థాపానికి గురయ్యారు. భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని అవమానంగా భావించి పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం తెలియటంతో చెన్నమ్మను, అతని కుమారుడిని విడిచిపెట్టారు. మద్దిలేటి పరిస్థితి విషమించటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై సీఐ వెంకటేశ్వరావుని వివరణ కోరగా, ఆ ప్రభుత్వ భూమిగా గుర్తించి ప్రభుత్వం సోలార్ సంస్థకు ఇచ్చిందని, కానీ ఇది తమదంటూ ఎలాంటి పత్రాలు లేకుండా మద్దిలేటి కుటుంబ సభ్యులు అడ్డుపడడంతో పోలీస్ స్టేషన్కు తరలించామని, ఎవరిని కొట్టలేదని వివరణ ఇచ్చారు.