శ్రీశైలంలో కన్నుల పండువగా రథోత్సవం.. ఒంగోలులో ఎడ్ల బండలాగుడు ప్రదర్శన
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. రథోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైల పురవీధులకు తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఆలయ ఉత్సవ మూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి రథంపై అధిష్టింపజేశారు. జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణి రెడ్డి, ఈవో ఎస్. లవన్న స్వామి అమ్మవార్లకు సాత్విక బలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలను సమర్పించారు. భక్తజన శివనామస్మరణల నడుమ శ్రీగిరి పురవీధుల్లో ఆదిదంపతులకు రమణీయంగా రథోత్సవం జరిగింది. రథోత్సవంలో కళాకారులు, కోలాటాలు, డమరుక నాదాలు, డోలు విన్యాసాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
రమణీయంగా కళ్యాణం: మహాశివరాత్రి పర్వదినం రోజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం రమణీయంగా సాగింది. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పరిణయానికి ముస్తాబు చేసి నంది వాహనంపై కొలువు తీర్చారు. అర్చకులు వేద పండితులు విశేష పూజలు చేసి నంది వాహనంపై ఆసీనులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ గావించారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఆర్పి మల్లికార్జున స్వామి గర్భాలయానికి, నందులకు చూడముచ్చటగా పాగా వస్త్రాన్ని అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణం నాగుల కట్ట వద్ద దేవదేవులకు కల్యాణ వేదిక అత్యంత వైభవంగా ముస్తాబు చేశారు. వివిధ వర్ణాల సోయగం సుమధుర భరితమైన పుష్పాలంకరణ వేదిక మధ్యన దేవదేవులైన శ్రీ స్వామి అమ్మవార్లు ఆది దంపతులుగా కొలువుదీరారు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం మహనందిలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. రైతు సంబరాల్లో బాగంగా మహనంది రైతు కమిటీ నిర్వహించిన ఈ పోటీలను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. సీనియర్స్, సబ్ జూనియర్స్, స్యూ కేటగిరి విభాగంలో ఈ పోటీలను మూడు రోజులపాటు జరగనున్నాయి. ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు.