Nara Lokesh: మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న లోకేశ్
Nara Lokesh Padayatra: కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేశ్.. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం మొదట మంచాలమ్మను దర్శించుకున్న ఆయన.. రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి సుబుదేందు తీర్థుల ఆశీర్వాదం తీసుకున్నారు.
బీసీల భద్రత కోసం టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని నారా లోకేశ్.. హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీసీలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత బీసీ కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసే విధానం తీసుకొస్తామని.. దామాషా ప్రకారం బీసీ ఉప కులాలకు నిధులు కేటాయిస్తామని.. సబ్సిడీ రుణాలు అందిస్తామని.. ఆదరణ పథకం తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. జగన్ కాన్వాయ్కి అడ్డంగా పడుకొని నిరసన తెలిపిన రైతుల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఉప కులాల వారీగా ముందు నియోజకవర్గం స్థాయిలో.. ఆ తరువాత మండల స్థాయిలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ సొంత మద్యం అమ్ముకోవడానికి.. కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని.. నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని.. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని... చెట్ల పెంపకం కోసం సహాయం అందిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాషింగ్ మెషీన్‌తో పాటు రజకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని వివరించారు.