YSRCP Vice MPP's grievance : 'మేం గాడిదలు కాస్తున్నామా..?' ఎమ్మెల్సీ ఎదుట వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ రగడ - శిలాఫలకం ప్రారంభోత్సవం
YSRCP MLC's own party's Vice MPP's grievance : నాలుగు సంవత్సరాలుగా గాడిదలు కాసేందుకు ఉన్నామంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎదుట సొంత పార్టీ ప్రజా ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ రావడంతో శిలాఫలకం మీద తన పేరు లేదంటూ లేపాక్షి మండలం వైస్ ఎంపీపీ అంజిన రెడ్డి అధికారులు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా తాము గాడిదలు కాసేందుకు ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ ప్రారంభోత్సవ శిలాఫలకంపై ప్రొటోకాల్ ప్రకారం వైస్ ఎంపీపీ పేరు ఎందుకు వేయలేదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు శిలాఫలకం ప్రారంభోత్సవం చేయనీయకుండా అడ్డంగా అంజిన రెడ్డి నిలబడడంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అధికారిని పిలిచి.. అతనికేదో సమాధానం చెప్పండయ్యా అని అన్నారు. దీంతో పోలీసులు, నాయకులు కలగజేసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వైస్ ఎంపీపీ అంజిన రెడ్డి ససేమిరా అన్నారు. ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.. రేపటి రోజు శిలాఫలకం మారుస్తారులే అంటూ వైస్ ఎంపీపీపై లేపాక్షి మండల ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా పేరు ఏర్పాటు చేసినప్పటికీ ప్రారంభోత్సవ సమయంలో వైస్ ఎంపీపీ అంజిన రెడ్డి దూరంగా ఉండిపోయారు.