MP AVINASH MEET CM JAGAN: సీఎం జగన్‌తో అవినాశ్ రెడ్డి భేటీ.. అందుకేనా..!
YSRCP MP AVINASH REDDY MEET CM YS JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన అవినాశ్ రెడ్డి.. జగన్‌ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే, ఈ భేటీలో సీఎం జగన్, అవినాశ్ రెడ్డిలు ఏం చర్చించారు..? ఏ అంశాలపై భేటీ అయ్యారు..? వివేకా హత్య కేసుపై ఏ నిర్ణయాలు తీసుకున్నారు..? అనే అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
సీఎం జగన్‌తో అవినాశ్ రెడ్డి భేటీ..ముఖ్యమంత్రి జగన్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం పలు కీలక అంశాలపై జగన్‌తో చర్చించారు. అందులో.. వివేకా హత్య కేసులో ఇటీవలే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం, అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు లేఖ సమర్పించడం వంటి అంశాలపై అవినాశ్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తనను (అవినాశ్ రెడ్డి) బయటపడేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి..? ఎలా అమలు చేయాలి..? ప్రజల్లోకి ఏయే అంశాలను తీసుకెళ్లాలి..? అనే విషయాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. దిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అవినాశ్ రెడ్డి పాల్గొనకుండా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ (ఏ-8) నిందితుడిగా చేర్చింది. దీంతో పలుమార్లు అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ.. ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ సమర్చించిన చార్జ్‌షీట్‌లోని కీలకమైన సాక్షుల వాంగ్మూలాలు వెలుగులోకి రావటం.. అందులో అవినాశ్ రెడ్డి ప్రస్తావన ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.