Venkatamireddy on SOs Promotions: "నిబంధనల ప్రకారమే సెక్షన్ అధికారుల పదోన్నతి జీవో"
AP Secretariat Employees Union Leader K.Venkatamireddy: సచివాలయం సెక్షన్ ఆఫీసర్ల పదోన్నతులకు సంబంధించిన జీవోపై వివరాలు కోర్టుకు అర్థం కాలేదని భావిస్తున్నానని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. సచివాలయంలో సెక్షన్ అధికారుల పదోన్నతుల జీవో నిబంధనల ప్రకారమే జారీ అయ్యిందన్నారు. హైకోర్టులో సరైన వాదనలు వినిపించకపోవటంతోనే కోర్టు ఆ ఉత్తర్వులను కంటెంప్ట్ గా భావించిందన్నారు. కోర్టు కంటెంప్ట్ ఉత్తర్వులు ఇవ్వటంతోనే అధికారులు భయపడ్డారని అన్నారు. కోర్టు ఆదేశాలకు అధికారులు భయపడి పదోన్నతుల జీవోను వెనక్కు తీసుకున్నారని తెలిపారు. వారు భయపడటంతో జీవో వెనక్కు తీసుకున్నా ఉద్యోగులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. హైకోర్టుకు పూర్తి వివరాలన్నీ వివరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సీనియారిటీ ప్రకారమే సెక్షన్ అధికారుల నుంచి అసిస్టెంట్ సెక్రటరీలుగా పదోన్నతుల జీవో ఇచ్చారన్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వం పదోన్నతుల జీవోను వెనక్కు తీసుకుందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. "1999 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఏఎస్ఓలను నియమించింది. 2002, 2005, 2017-18లో మూడు విడుతల్లో ఏఎస్ఓలు నియమితులయ్యారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వీరంతా కామన్ సీనియారిటీ కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ ప్రభుత్వం 50 మంది ఎస్ఓలకు పదోన్నతి కల్పించింది" అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.