Janasena Chalo Assembly Programme ఎన్నికల హామీలను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం.. జనసేన ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీకి పిలుపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2023, 6:55 PM IST
|Updated : Sep 24, 2023, 7:55 PM IST
Janasena Chalo Assembly Programme: వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలపై జనసేన ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు.. ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రకటించారు. సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో.. మిత్ర పక్షాలైనా టీడీపీ, బీజేపీలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, చేసిన వాగ్దానాలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. అక్రమ వ్యాపారాలతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని విమర్శించారు. సహజ వనరులతో పాటు సముద్రపు ఇసుకను సైతం వదిలిపెట్టకుండా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రపు ఇసుకలో సిలికాన్ దొరుకుతుందని.. చివరకి దాన్ని కూడా టెండర్లు పిలిచి దోచుకుంటున్నారన్నారు. కొండల దగ్గర్నుంచి ఇలా ప్రతిది దోచుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తోందని అన్నారు. అందుకే మైనింగ్, పోలీస్, ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లుగా.. నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.